సామాజిక అంశాన్ని తీసుకొని దాన్ని సినిమాగా మలచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉండాలి. అంతర్లీనంగా సందేశాన్ని ఇస్తూ కమర్షియల్ మూవీ చేయాలంటే డైరెక్టర్‌కి కథ, కథనాల పట్ల మంచి పట్టు ఉండాలి. అది ఏమాత్రం సడలినా మొదటికే మోసం వస్తుంది. అలాంటి కథలతో సినిమాలు తియ్యడంలో శంకర్‌ది అందె వేసిన చేయి. జెంటిల్‌మెన్ చిత్రంలో ఒక బర్నింగ్ ప్రాబ్లమ్‌ని తీసుకొని దాని చుట్టూ కథను అల్లి, కమర్షియల్ అంశాల్ని కూడా జోడిరచి తన మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ సాధించిన డైరెక్టర్ శంకర్. ఆ సినిమాతో తన అభిరుచి ఏమిటో, ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలనుకుంటున్నాడో చెప్పేశాడు. ఆ సినిమా తర్వాత మూస ధోరణిలో వెళ్ళకుండా ప్రేమికుడు వంటి లవ్‌స్టోరీ చేశారు. వెనువెంటనే లంచగొండితనం అనే పాయింట్‌ని తీసుకొని భారతీయుడు వంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా తర్వాత శంకర్ చెయ్యాలనుకున్న సినిమా ఒకే ఒక్కడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేసే ఆలోచన ఉన్నప్పటికీ భారతీయుడు తర్వాత అలాంటి సినిమా చెయ్యడం కరెక్ట్ కాదని భావించారు. అందుకే ప్రశాంత్, ఐశ్వర్యారాయ్‌లతో జీన్స్ వంటి ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేసి మరో విజయాన్ని అందుకున్నారు.
జీన్స్ తర్వాత తన మనసులో మెదులుతున్న సబ్జెక్ట్‌పై దృష్టి సారించారు శంకర్. 70వ దశకంలో నిక్సన్ ఇంటర్వ్యూస్ అమెరికాలో చాలా ఫేమస్. ఒక మీడియా రిపోర్టర్ అమెరికా ప్రెసిడెంట్‌ని ఇంటర్వ్యూ చేయడం శంకర్‌ని బాగా ఆకట్టుకుంది. దాని ఇన్‌స్పిరేషన్‌తో ఒక సీఎంని మీడియా రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసే సీన్ రాసుకున్నారు. దాని చుట్టూ కథ అల్లారు. అందులో ఒకరోజు సీఎం అనేది మెయిన్ పాయింట్. ఒక సాధారణ వ్యక్తి ఒకరోజు ముఖ్యమంత్రిగా చేయడం అనేది రాజ్యాంగంలో ఎంతవరకు వీలుంది అనే విషయంలో ఒక హైకోర్టు జడ్జి సలహా తీసుకున్నారు. ఈ కథను రజినీకాంత్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారు శంకర్. కథ పూర్తయిన తర్వాత ఈ సినిమా విషయంలో రజినీకాంత్‌ని సంప్రదించారు. కానీ, రజినీ ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్పారు. ఎందుకంటే రాజకీయ ప్రవేశం చెయ్యాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఈ సినిమాలోని రాజకీయ అంశాలు భవిష్యత్తులో తనకు ఆటంకాన్ని కలిగిస్తాయని రజినీ భావించారు.
శంకర్ నెక్స్‌ట్ ఛాయిస్ కమల్‌హాసన్. అయితే అప్పటికే కమల్ తన హేరామ్ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ కుదరకపోవడంతో అప్‌కమింగ్ హీరోతో చెయ్యాలనుకొని విజయ్ కోసం ట్రై చేశారు. అప్పట్లో విజయ్ డేట్స్‌ని ఆయన తండ్రి చంద్రశేఖర్ చూసుకునేవారు. శంకర్ కో డైరెక్టర్‌కి, అతనికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో అదీ కుదరలేదు. చివరికి తన మొదటి హీరో అర్జున్‌ని సంప్రదించాడు శంకర్. కథ విన్న వెంటనే 120 రోజులు డేట్స్ ఇచ్చేశారు అర్జున్. ఇక సీఎం క్యారెక్టర్ కోసం మొదటి నుంచీ శంకర్ మనసులో రఘువరనే ఉన్నారు. అతనికి స్క్రీన్ టెస్ట్ చేయించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయారు. 1998 అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. తమిళ్‌లో ‘ముదలవన్’గా, తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా టైటిల్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టోటల్‌గా 150 వర్కింగ్ డేస్‌లో పూర్తయింది.
ఈ సినిమా మేకింగ్‌కి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. చెన్నయ్ మౌంట్ రోడ్‌లో తీసిన ట్రాఫిక్ సీన్ సినిమాకి ఎంతో కీలకమైంది. దాదాపు 600 మంది జూనియర్ ఆర్టిస్టులతో 40 రోజుల పాటు ఈ సీన్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డైరెక్టర్ కె.వి.ఆనంద్.. తన కెరీర్‌లో ఎంతో కష్టపడి చేసిన సీన్ ఇదని, ఫైనల్‌గా ఔట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చిందని ఎంతో సంతోషంగా చెబుతారు. ఎవిఎం స్టూడియోలో సీఎం ఆఫీస్ సీన్స్ తీశారు. అలాగే మైసూర్, రాజస్థాన్‌లలో కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. ‘మగధీర..’ సాంగ్‌ని మైసూర్ ప్యాలెస్‌లో తీశారు. ఇందులో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల లండన్ నుంచి టెక్నీషియన్స్‌ని పిలిపించారు. సినిమాలో ఉన్న ఆరు పాటలను.. ఆరు కాన్సెప్ట్స్‌తో తీయడం శంకర్‌కే సాధ్యమైంది. ముఖ్యంగా అందాల రాక్షసివే, మగధీరా, షకలక బేబీ, నెల్లూరు నెరజాణ పాటలు ఇప్పటికీ వింటున్నారంటే అవి ప్రేక్షకులకు ఎంతగా నచ్చాయో అర్థం చేసుకోవచ్చు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికి తమిళ్‌లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.
ఇక సినిమాలో ప్రేక్షకుల్ని కట్టిపడేసే సీన్స్ కోకొల్లలు. ముఖ్యంగా సీఎంని ఇంటర్వ్యూ చేసే సీన్ అంత అద్భుతంగా ఏ ఇండియన్ మూవీలోనూ రాలేదు. అలాగే కొన్ని వందల మందితో తీసిన ట్రాఫిక్ సీన్ అంత నేచురల్‌గా మరెవ్వరూ తియ్యలేరు అన్నంతగా శంకర్ చిత్రీకరించారు. ముఖ్యమంత్రి ఒకరోజులో చేసిన కార్యక్రమాలన్నీ ఎంతో కన్విన్సింగ్‌గా ఉంటాయి. అంతేకాదు, హీరో రాజకీయాల్లోకి రావాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జనం మధ్యలో ఓ వికలాంగుడు అనే మాటలు కంటతడి పెట్టిస్తాయి, హీరోని ఇన్‌స్పైర్ చేస్తాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ అనేది లేకుండా పర్‌ఫెక్ట్ స్క్రీన్‌ప్లేతో నడిపించారు. ఇక ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా రిలీజ్ అయి పాతిక సంవత్సరాలవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తున్నాయంటే దాని వెనుక రెహమాన్ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తమిళ్ వెర్షన్ ‘ముదలవన్’ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే.. మొదటి వారం సాధించిన కలెక్షన్స్‌తో ‘నరసింహ’ మూవీ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. చెన్నయ్ సిటీలో 50 రోజుల్లో అత్యధిక వసూళ్ళు రాబట్టి ఫస్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది. 120 కేంద్రాల్లో 50 రోజులు, 62 సెంటర్స్‌లో 100 రోజులు రన్ అయింది. టోటల్‌గా రూ.48 కోట్లు కలెక్ట్ చేసి భారతీయుడు, నరసింహ తర్వాత ఆల్‌టైమ్ కలెక్షన్స్ సాధించిన టాప్ 3 మూవీగా నిలిచింది. తెలుగులో ‘ఒకే ఒక్కడు’ 57 కేంద్రాల్లో 50 రోజులు, 30 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. అప్పటికి డబ్బింగ్ సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘ఒకే ఒక్కడు’. ఈ సినిమా చూసిన అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా శంకర్‌ను ఆహ్వానించి అభినందించారు.